న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన స్కార్పెన్ క్లాస్ ఐదవ సబ్‌మెరైన్ తొలి సముద్ర ట్రయల్ కోసం మంగళవారం బయలుదేరింది. అన్ని పరీక్షల అనంతరం ఈ ఏడాది చివరిలో నౌకాదళంలో ఇది చేరుతుంది. నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ డిజైన్ చేసిన జలాంతర్గామి ‘యార్డ్ 11879’ ని ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మిస్తున్నది. నేవీలోకి ప్రవేశం తర్వాత ఈ సబ్‌మెరైన్‌కు ‘వాగిర్’ అని నామకరణం చేస్తారు.
ప్రాజెక్ట్ 75లో భాగంగా ఇప్పటికే రెండు జలాంతర్గాములను ఎండీఎల్ గత సంవత్సరం పంపిణీ చేసిందని ఇండియన్ నేవీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఐదవ జలాంతర్గామి సముద్ర పరీక్షలు ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించింది. 2009 జూలైలో దీని నిర్మాణం ప్రారంభమైందని చెప్పింది. అధునాతన సాంకేతిక వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు నేవీ పేర్కొంది.