Female Doctor-Assault | కోల్కతా ప్రభుత్వ దవాఖానలో డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి, హత్యపై నిరసనలు వెల్లువెత్తుతుంటే ముంబైలోనూ ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మీద దాడి చేసిన ఘటనపై ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ దవాఖాన క్యాజువాలిటీ వార్డులో ఆదివారం తెల్లవారుజామున ఒక రోగి చెవి నుంచి వస్తున్న రక్తాన్ని ఆమె క్లీన్ చేస్తున్నప్పుడు వీరు దాడి చేశారు. మహిళా వైద్యురాలితో వారు వాగ్వాదానికి దిగారని సియాన్ పోలీసు స్టేషన్ అధికారి చెప్పారు. రోగితోపాటు వచ్చిన ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆ వైద్యురాలిపై దాడికి ప్రయత్నించారని దవాఖాన సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరారన్నారు.
ఈ ఘటనపై సియాన్ దవాఖాన ఓ ప్రకటన చేస్తూ .. ఆదివారం తెల్లవారుజామున వార్డులో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై ఐదారుగురు వ్యక్తులు మద్యం మత్తులో దాడికి ప్రయత్నించారని పేర్కొంది. దీంతో మహిళా వైద్యురాలు ప్రతిఘటించడంతో గాయాలయ్యాయని వెల్లడించింది. వైద్యులకు రక్షణ కల్పించాలని కోరింది.