న్యూఢిల్లీ, మే 3: ఉద్యమం విరమణ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మీద అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఉద్యమబాట పడుతామని హెచ్చరించారు. ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్‌లో జాతీయ రైతు సంఘాల సమాఖ్య సమావేశమైంది. ఈ భేటీకి కిసాన్ సంయుక్త మోర్చాలో భాగంగా ఉన్న 80 మంది రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించడంపై కేంద్రం తాత్సారం చేస్తుండటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చకుంటే మళ్లీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని రైతు నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శివకుమార్ కక్కా హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీలో గత ఏడాది కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్‌తో తొక్కించి చంపిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఎస్కేఎం గురువారం లఖింపూర్‌లో నిరసన చేపట్టనున్నది. ఆందోళనలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులు లఖింపూర్‌కు పయనమవుతున్నారు.