న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఫెయిల్ భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. మెడిసిన్, ఇంజినీరింగ్లో కెరీర్ ఆశించే విద్యార్థులు కఠినమైన పోటీ, ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం చర్చకు దారితీస్తున్నది. దేశవ్యాప్తంగా ఇటీవలికాలంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడించింది. 2021లో దేశవ్యాప్తంగా 13,089 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపింది. 2020 సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల ఆత్మహత్యలు 4.5 శాతం పెరిగినట్టు వెల్లడించింది. మరణాల్లో సగం మంది విద్యార్థులు ఈ ఐదు రాష్ర్టాల (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా) నుంచే ఉన్నట్టు పేర్కొన్నది. ఆత్మహత్యల వెనుక నిర్దిష్టమైన కారణాలను నివేదిక ప్రస్తావించనప్పటికీ.. పరీక్షల్లో ఫెయిల్ ఒక కారణంగా పేర్కొన్నది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.