Kolkata Incident : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ ఘటనను వివరిస్తూ బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి హేయమైన ఘటన ఏ ఒక్కరికీ జరగరాదని కన్నీటిపర్యంతమయ్యారు. ఇక ఇలాంటి పరిస్ధితి ఏ ఒక్క తల్లికీ ఎదురుకాకూడదని, తమలా ఏ ఒక్కరూ తమ పిల్లలను కోల్పోరాదని బాధితురాలి తల్లి అన్నారు.
నిందితుడు పట్టుబడేవరకూ దేశ ప్రజలంతా తమ వెన్నంటి నిలవాలని ఇందుకు తాము ప్రజలకు కృతజ్ఞతతో ఉంటామని ఆమె కోరారు. ఇక కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనతో దేశం ఉలిక్కిపడింది. వైద్యరాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. వైద్యుల పట్ల తాను సానుభూతి వ్యక్తం చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతున్నానని చెప్పారు. వైద్యులపై జరుగుతున్న హింస గురించి తాను గత రెండేండ్లుగా పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నానని, ఈ అంశంపై అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో వాదన జరిగిందని గుర్తుచేసుకున్నారు.
విధి నిర్వహణలో ఉండే వైద్యుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ బిల్లును తీసుకురావాలని తాను వాదించానని చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి విచిత్రమైన సమాధానం వచ్చిందని చెప్పారు. ఒక వృత్తికి ఇలాంటి భద్రతతో కూడిన బిల్లును తీసుకువస్తే ఇతరుల కోసం కూడా ఇలా చేయాల్సి వస్తుందని ప్రభుత్వం బదులిచ్చిందని అన్నారు. ఇది ఏమాత్రం అర్ధం లేని వాదన అన్నారు. ప్రజల్లో ఇలాంటి విషయాలపై అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలోనే మనం మరో వైద్యురాలిని కోల్పోవడం తనను బాధించిందని శశి థరూర్ విచారం వ్యక్తం చేశారు.
Read More :