న్యూఢిల్లీ: స్థానిక రైల్వే స్టేషన్లలో హల్దీరామ్స్, వావ్! మోమోస్ వంటి ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ దర్శనమిచ్చే అవకాశం కనిపిస్తున్నది. రైల్వే స్టేషన్లలో ప్రీమియం ఫుడ్, బెవరేజ్ ఔట్లెట్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలపై స్పష్టత కోసం ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ రెస్టారెంట్లు, ఫుడ్ చైన్స్ భారతీయ రైల్వేలను సంప్రదిస్తున్నాయి. విమానాశ్రయాల్లో కన్నా రైల్వే స్టేషన్లలో అమ్మకాలు అధికంగా ఉంటాయని ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, హల్దీరామ్స్, వావ్! మోమోస్, బస్కిన్ రాబిన్స్ వంటి బ్రాండ్లు రైల్వే స్టేషన్లలో ఔట్లెట్లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వనున్నట్లు గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్థలు తమ ఔట్లెట్లను ఏర్పాటు చేయడం 2026 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. 7,000కుపైగా రైల్వే స్టేషన్లలో ఈ-ఆక్షన్ ద్వారా రెస్టారెంట్ చైన్స్‌కు ఐదేండ్ల లైసెన్స్‌లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంపెనీల యాజమాన్యంలో లేదా ఫ్రాంచైజీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయవచ్చునని తెలిపింది. రైల్వే స్టేషన్లలో స్థలాన్ని వినియోగించుకుంటున్నందుకు నిర్ణీత లైసెన్స్ ఫీజును చెల్లించవలసి ఉంటుందని చెప్పింది.