శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలని రాష్ట్ర మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ను శనివారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో సాధారణ పరిస్ధితులను తిరిగి తీసుకువచ్చేందుకు ఈ చర్య అనివార్యమని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్ధితి సజావుగా ఉందని కేంద్రంలో బీజేపీ పాలకులు చెబుతున్నారని వారి అసమర్ధత వల్లే కశ్మీర్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను కశ్మీర్లో ఇప్పుడు అధికారంలో ఉంటే ఈ మరణాలకు కాషాయ పార్టీ నేతలు తనను నిందించేవారని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలన అత్యంత పేలవంగా ఉందని విమర్శించారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగనంతవరకూ జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్ధితులు నెలకొనవని ఫరూక్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఎన్నటికీ సాధారణ పరిస్ధితులను తిరిగి తీసుకురాలేదని పేర్కొన్నారు.