ముంబై: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను భారతీయ ముస్లింనని, చైనా ముస్లిం కాదని అన్నారు. దేశంలోని ముస్లింల పట్ల కేంద్రంలోని బీజేపీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నదని ఆయన ఆరోపించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత ఛగన్ భుజబల్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. ముస్లిం వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలంటూ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించడంపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఒక్కటిగా ఉంచాలని, అందుకే తాను మీతో ఉన్నానని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ‘అందరూ వేర్వేరుగా ఉండవచ్చు. కానీ మనమంతా కలిసి ఈ దేశాన్ని నిర్మించగలం. దానినే స్నేహం అంటారు. ఒకరినొకరు ద్వేషించుకోవాలని మతాలు బోధించవు. ఇది హిందుస్థాన్. అందరికీ చెందినది’ అని వ్యాఖ్యానించారు. శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే, గీత రచయిత జావేద్ అక్తర్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.