చండీగఢ్ డిసెంబర్ 11: కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని రైతన్నలు నిరసనబాట పట్టారు. భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఆజాద్ బుధవారం సంగ్రూర్ జిల్లాలో స్మార్ట్ పవర్ మీటర్లను తొలగించి నిరసన తెలిపింది. మరోవైపు, లూధియానాలోని అనేక గ్రామాలకు చెందిన రైతులు భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్(పంజాబ్) నాయకత్వంలో బుధవారం చిప్-ఆధారిత స్మార్ట్ మీటర్లను తొలగించారు. సస్రాలీ, బూత్గఢ్, ప్రేమ్ కాలనీ, గౌతమ్ కాలనీతోపాటు సమీపంలోని గ్రామాలలో ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను తొలగించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
అనంతరం వాటిని గావన్గఢ్, కకోవల్ విద్యుత్తు కేంద్రాల వద్ద జమచేసినట్లు వారు తెలిపారు. విద్యుత్తు రంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు మొదటి అడుగుగా రైతు నాయకులు అభివర్ణించారు. విద్యుత్తు బోర్డును ప్రైవేట్ కంపెనీలకు అమ్మడానికి కేంద్రం సిద్ధపడుతుంటే బోర్డుకు చెందిన భూములను విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వారు ఆరోపించారు. ఇదే జరిగితే విద్యుత్తు సబ్సిడీలు నిలిచిపోయి రైతులు, సామాన్య వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుందని వారు చెప్పారు. ప్రభుత్వ వనరులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడాన్ని తాము అడ్డుకుంటామని తెలిపారు.