ఫతేహాబాద్, జనవరి 4: ఖనౌరీ సరిహద్దులో రైతులు కొనసాగిస్తున్న నిరసన నుంచి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా లబ్ధి పొందుతోందని రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ఆరోపించారు. హర్యానాలోని ఫతేహాబాద్లో శనివారం జరిగిన రైతుల మహా పంచాయత్‌లో ఆయ న ప్రసంగించారు. రోడ్లు మూత పడడంతో సిక్కులు(పంజాబీలు) తీవ్ర అసౌకర్యం చెందుతున్నందున రైతుల నిరసన కారణంగా పంజాబ్ ప్రభుత్వం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన అన్నా రు. ఈ కారణంగానే ఖనౌరీ సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనకు ముగింపు పలకాలన్న ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని అన్నారు.
ఈసా రి రైతులు ఢిల్లీ యాత్ర చేపట్టినపుడు లోపల నుంచి దేశ రాజధాని నగరాన్ని చుట్టుముట్టే బదులుగా అన్ని వైపులా నుంచి నగరాన్ని దిగ్బంధించడం కోసం కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేను చుట్టుముడతామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతానికి వివిధ ప్రదేశాలలో యునైటెడ్ కిసాన్ మోర్చా పంచాయత్‌లను నిర్వహిస్తుందని, ఢిల్లీ యాత్ర ప్రారంభం కావడానికి ముందు రైతులకు పిలుపునిస్తామని ఆయన చెప్పారు. రైతుల ఢిల్లీ యాత్రకు ఇంకా తేదీ ఖరారు చేయలేదని ఆయన తెలిపారు. రైతులు వివిధ పద్ధతులలో తమ నిరసనలు తెలియచేస్తున్నారని, ప్రస్తుతం దేశం లో దాదాపు 700 రైతు సంఘాలు ఉన్నాయని టికాయత్ చెప్పారు.