చంఢీగఢ్, ఫిబ్రవరి 22: తమ డిమాండ్ల సాధనకు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులతో ఎట్టకేలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం చర్చలు జరిపారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.
రైతు నేతలు జగ్జీత్ సింగ్ డల్లేవాల్, శర్వణ్ సింగ్ పాంథేర్ తదితరులతో కూడిన 28 మంది బృందంతో మంత్రి చౌహాన్ సమావేశమయ్యారు. వివిధ సమస్యలపై రెండు గంటల పాటు చర్చించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని చౌహాన్ వెల్లడించారు. రెండో విడత చర్చలను మార్చి 19న నిర్వహించాలని నిర్ణయించారు. చర్చల వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, పంజాబ్ మంత్రులు హర్పల్ సింగ్ చీమా, గుర్మీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.