చండీగఢ్: తమతో చర్చలను ఫిబ్రవరి 14న కాకుండా ముందుగానే జరపాలని రైతు సంఘాలు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇది తాము విధిస్తున్న నిబంధన కాదని స్పష్టం చేశాయి. ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు ప్రకటనకు ఎన్నికల సంఘం అభ్యంతరం తెలపనప్పుడు.. తమతో చర్చలు జరపడానికి కేంద్రానికి ఇబ్బందేమిటని రైతు నేతలు ప్రశ్నించారు.
అయితే కేంద్రం చర్చలకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో మంగళవారం 101 మంది రైతులు నిర్వహించాలనుకున్న ఢిల్లీ మార్చ్‌ను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు వైద్య చికిత్స తీసుకొంటున్న రైతు నేత డల్లేవాల్ తన నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ముఖ్య నాయకుడైన డల్లేవాల్ నిరాహార దీక్ష విరమించాలని రైతు నేత ఎంఎస్ రాయ్ కోరారు.