ఛత్రపతి శంభాజీనగర్: బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన 8 జిల్లాలలో 2024లో 800 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. వీరిలో 303 మంది కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు జరిగిందని, మరో 314 కేసులలో దర్యాప్తు జరుగుతున్నదని ఆయన తెలిపారు.
డివిజినల్ కార్యాలయం అందజేసిన నివేదిక ప్రకారం మరాఠ్వాడాలో 822 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీడ్ జిల్లాలో అత్యధికంగా 160 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నవంబర్ 30 వరకు 303 కేసులలో రూ. 3.03 కోట్ల నష్ట పరిహారం చెల్లించగా మరో 314 కేసులకు సంబంధించి దర్యాప్తు పెండింగ్లో ఉంది. బీడ్ తర్వాత రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నాందేడ్(146), ధారాశివ్(143)లో చోటుచేసుకున్నాయి.