ముంబై, ఆగస్టు 20: ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ల వద్ద రైతులు ఆదివారం ఆందోళనలు చేశారు. నాసిక్ జిల్లాలోని సతనా, మాలెగావ్, లాసల్గావ్తోపాటు అహ్మద్‌నగర్, పుణె జిల్లాలోని మంచర్, ఖేడ్ హోల్‌సేల్ మార్కెట్ల వద్ద నిరసన చేపట్టారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని రాహురి తహాశీల్ రైతులు ఉల్లి వేలంను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడిందని స్వాభిమాని శేత్కరీ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ జగ్తాప్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఉల్లి ఎగుమతులతో కొంతమేర ఆదాయం వస్తుందని రైతులు అనుకొంటుంటే.. కేంద్రం విధించిన సుంకం వలన ఎగుమతులకు అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల బాధలను అర్థం చేసుకోవాలి
రైతుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, ఎగుమతి సుంకంతో వ్యాపారస్తులు ఉల్లి పంటకు తక్కువ ధర ఇస్తారని రాహురిలో ఆందోళనలో పాల్గొన్న ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్ మార్కెట్ అయిన నాసిక్ జిల్లాలోని లాసల్గావ్ వ్యవసాయ మార్కెట్లో గత వారం ఉల్లి ధరలు దాదాపు 45 శాతం పెరిగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లాసల్గావ్ వ్యాపారి ఒకరు మాట్లాడుతూ రెండు వారాల క్రితం క్వింటాల్ ఉల్లి రూ.1,500 పలికిందని, అదే గత వారానికి రూ.2,200కు పెరిగిందని, అయితే ప్రస్తుతం సుంకం వల్ల ఎగుమతులు సాధ్యం కాకపోవడంతో.. ధరలు క్రమంగా పడిపోతున్నాయని తెలిపారు.
టమాటాల దిగుమతి మతి లేని చర్య
మరోవైపు కేంద్రంలోని బీజేపీ పాలనలో టమాటాలను దిగుమతి చేసుకొనే దుస్థితి వచ్చింది. గత రెండు నెలలుగా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో టమాటా ధర మోత మోగింది. టమాటా ధరలను నియంత్రించలేకపోయిన ప్రభుత్వం.. టమాటాల దిగుమతి కోసం నేపాల్‌ను ఆశ్రయించింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేపాల్ నుంచి టమాటాల దిగుమతి చేసుకోవాలని తీసుకొన్న నిర్ణయం మతిలేని చర్య అని స్వాభిమాని శేత్కరీ సంఘటన్ అధ్యక్షుడు, మహారాష్ట్ర రైతు నేత రాజు శెట్టి విమర్శించారు. దీని వలన మన రైతులు తీవ్రంగా నష్టపోతారని, దేశీయ మార్కెట్టు కుదేలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.