న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేంద్రంలోని మోదీ సర్కార్‌పై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి. హక్కులు, డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు(సీటీయూ) శుక్రవారం ప్రకటించాయి.
బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్ల ఉమ్మడి వేదిక ఈనెల 28న చేపట్టిన సమ్మెకు మద్దతిస్తున్నట్టు తెలిపాయి. లేబర్ కోడ్ల ఆమోదాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు సెప్టెంబర్ 28న తలబెట్టిన ‘బ్లాక్ డే’ నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు. సంయుక్త సమావేశంలో పలు అంశాలపై చర్చించిన రైతు, కార్మిక సంఘాల నేతలు ఈ మేరకు భవిష్యత్తు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని విమర్శించారు. పంటలకు ఎంఎస్పీతో సహా రైతుల ఇతర డిమాండ్లను కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది ప్రస్ఫుటం అయిందని పేర్కొన్నారు. నిరుద్యోగం, వ్యవసాయ రంగ సంక్షోభం తదితర సమస్యలు బడ్జెట్లో పట్టించుకోలేదని ఎస్కేఎం, సీటీయూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
త్వరలో నాలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆయా రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలను ఓడించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. అదేవిధంగా దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, నేరాల ఘటనలను ఖండించిన నేతలు.. పౌరులందరి భద్రతకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈసారి మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న బీజేపీకి.. రైతు, కార్మిక సంఘాల ఉమ్మడి ఆందోళనలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.