Supreme Court | నిరసనల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుకూడదని రైతు నేత జగ్జీత్ సింగ్ దల్వాల్తో పాటు రైతులకు సుప్రీంకోర్టు సూచించింది. హైవేలను దిగ్బంధించొద్దని.. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిరసన తెలుపుతున్న రైతులను ఒప్పించండని రైతు నేతలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రైతునేత జగ్జీత్ సింగ్ దల్వాల్ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కుందన్న బెంచ్ పేర్కొంది. రైతులు లేవనెత్తిన సమస్యలను కోర్టు గుర్తించిందని.. వాటిని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసనలు నిర్వహచ్చవ్చని.. కానీ, ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని పిటిషనర్ దల్లెవాల్ తరపు న్యాయవాదికి ధర్మాసనం చెప్పింది. రైతుల నిరసన సరైనదా? తప్పా? అన్న దానిపై తాము వ్యాఖ్యానించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చట్టం ప్రకారం శాంతియుతంగా నిరసనలు నిర్వహించేందుకు దల్లేవాల్ నిరసనకారులను ఒప్పించగలరని అన్నారు. ప్రస్తుతం తాము దల్లేవాల్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని.. అయితే తర్వాత సంప్రదించవచ్చని ధర్మాసనం పేర్కొంది.
ఇదిలా ఉండగా.. నవంబర్ 26 నుంచి పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ సరిహద్దులో రైతు నేత జగ్జిత్ సింగ్ దలెల్వాల్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విసయం తెలిసిందే. అయితే, ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన కొద్ది గంటలకే పోలీసులు బలవంతంగా ఆయనను దీక్షను భగ్నం చేసి లూథియానాలోని ఆసుపత్రికి తరలించారు. గత శుక్రవారం ఆయన ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నవంబర్ 30న మళ్లీ ఖనౌరీ సరిహద్దులకు చేరుకొని నిరసన ప్రారంభించారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఎంఎస్పీకి చట్టపరమైన హామీతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాల్సిందేనన్నారు. రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, రుణమాఫీ, భూసేకరణచట్టం 2013 పునరుద్ధరణ, గతంలో నిరసనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.