నాసిక్, డిసెంబర్ 24: మహారాష్ట్ర మత్స్య శాఖ మంత్రి నితేశ్ రాణెకు సోమవారం ఊహించని నిరసన ఎదురైంది. చిరాయ్ గ్రామంలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మెడలో ఓ ఉల్లి రైతు ఉల్లిగడ్డల దండ వేసి వాటి ధర పతనంపై ఘాటుగా నిరసన తెలిపాడు.నాసిక్ ప్రాంతంలో గత పది రోజుల్లో క్వింటాల్ ఉల్లి ధర రూ.2 వేలకు పడిపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
ఉల్లి ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడం ధరలను స్థిరీకరించడంలో విఫలమైందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ 20 శాతం పన్నును తొలగించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విజ్ఞప్తి చేశారు.అకాల వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల ఉల్లి రైతులు బాగా నష్టపోతున్నారని ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.