జైపూర్: భూమికి పరిహారం కోసం కుటుంబంతో కలిసి సజీవ దహనానికి ఒక రైతు ప్రయత్నించాడు. రోడ్డుపై చితి పేర్చి నిరసన తెలిపాడు. (Rajasthan farmer) దీంతో పోలీసులు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. అయితే తాజాగా ఆ రైతుకు పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.9.91 లక్షల జరిమానా విధించారు. రైతు కుటుంబం సజీవ దహనాన్ని అడ్డుకునేందుకు అయిన ఖర్చుల మొత్తాన్ని వారంలో చెల్లించాలంటూ నోటీస్ పంపారు. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
డిసెంబర్ 10న రైతు విద్యాధర్ యాదవ్ తన కుటుంబంతో కలిసి నిరసన తెలిపాడు. సిమెంట్ కంపెనీకి ఇచ్చిన భూమికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. పరిహారం అందని పక్షంలో తన కుటుంబంతో కలిసి సజీవ దహనానికి అనుమతించాలని కోరాడు. రోడ్డుపై కట్టెలతో చితిని ఏర్పాటు చేసి నిరసన తెలిపాడు. దీంతో దిగి వచ్చిన ఆ సిమెంట్ కంపెనీ ఆ రైతుకు రూ.3 కోట్లు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.
కాగా, పోలీసులు తాజాగా రైతు విద్యాధర్ యాదవ్‌కు షాక్ ఇచ్చారు. కుటుంబంతో కలిసి సజీవ దహనానికి పాల్పడతానని బెదిరించినందుకు రూ.9.91 లక్షల జరిమానా విధించారు. ఎస్పీ శరద్ చౌదరి ఆ రైతుకు ఈ మేరకు నోటీసు జారీ చేశారు. రైతు కుటుంబం స్వీయ దహనానికి పాల్పడకుండా నిరోధించడానికి పోలీస్ శాఖకు భారీగా ఖర్చు అయ్యిందని అందులో పేర్కొన్నారు.
మరోవైపు అధికార వాహనాల వినియోగంతో పాటు ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలతోపాటు 99 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ఆ నోట్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడిందని వివరించారు. డిసెంబర్ 24లోగా ఎస్పీ కార్యాలయంలోని ఖాతాల శాఖలో రూ.9,91,577 జమ చేయాలని ఆ రైతుకు పంపిన నోటీస్‌లో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.