పాటియాల, జనవరి 9: డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ధర్నాలో ఉన్న రైతు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 55 ఏండ్ల రైతు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, గత మూడు వారాల వ్యవధిలో ఇది రెండో ఆత్మహత్యని రైతు నేతలు తెలిపారు. తరన్ తరన్ జిల్లా పహువింద్కు చెందిన రేషమ్ సింగ్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, అతడిని పాటియాలలోని రేషమ్ సింగ్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.కాగా, రంజోధ్ సింగ్ అనే మరో రైతు డిసెంబర్ 18న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సమస్యల పరిష్కారానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోవడానికి దేశంలోని రైతు సంఘాలంతా ఏకం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. పంజాబ్‌లోని మోగలో జరిగిన మహాపంచాయత్‌లో నేతలు మాట్లాడుతూ రైతుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రైతు సంఘాల ఐక్యతపై ఎస్‌కేఎంకు చెందిన 101 మంది రైతులతో శుక్రవారం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ మోర్చా, సంయుక్త్ కిసాన్ మోర్చా (రాజకీయేతర) నేతలను కలవనున్నట్టు చెప్పారు.