Rs 10 coin | న్యూఢిల్లీ : ఓ 12 ఏండ్ల బాలుడు ఆడుకుంటూ రూ. 10 నాణెంను మింగాడు. అది ఆహార నాళంలో ఇరుక్కుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే వైద్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. 15 నిమిషాల వ్యవధిలో తొలగించి, బాలుడి ప్రాణాలు కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఓ 12 ఏండ్ల బాలుడు గత నెల 28వ తేదీన ఆడుకుంటూ.. రూ. 10 నాణెం మింగాడు. తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు.. తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో హుటాహుటిన ఫరీదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ నిర్దేశ్ చౌహాన్ నేతృత్వంలో బాలుడికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. ఆహార వాహికలో రూ. 10 నాణెం ఉన్నట్లు నిర్ధారించారు. ఆలస్యం అయితే ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉందని భావించిన వైద్యులు తక్షణమే ఎండోస్కోపి ద్వారా చికిత్స నిర్వహించారు. కేవలం 15 నిమిషాల్లోనే రూ. 10 నాణెం తొలగించారు. సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.