ముంబై : 200 ఏండ్ల తర్వాత ఆ కుటుంబంలో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందంతో తల్లిని, బిడ్డను సింహాసనంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని బ్రిడ్ గ్రామానికి చెందిన దహిఫలే కుటుంబంలో నాలుగు తరాల తర్వాత ఆడపిల్ల పుట్టింది. దీంతో దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన తర్వాత చిన్నారికి దర్గి అని పేరు పెట్టారు. దర్గి, ఆమె తల్లిని సింహాసనంపై ఎక్కించి డప్పు చప్పుళ్లు, డ్యాన్సులతో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.
దర్గి తాత లింబాజీ దహిఫలే మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో ఇన్నేండ్లుగా ఆడపిల్ల లేదని ఎంతో బాధపడ్డాం. మా కోడళ్లనే కూతుర్లుగా చూసుకున్నాం. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని తెలిపాడు. ఈ రోజు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని, అందుకే డప్పుచప్పుళ్లతో తీసుకెళ్లాలని నిర్ణయించామని దర్గి నానమ్మ సురేఖ వెల్లడించారు. అందరూ కొడుకు పుట్టాలని కోరుకుంటారని, కానీ కూతురు పుట్టడం ఎంతో అనుభూతినిస్తుందని దర్గి తండ్రి చెప్పారు.