బెంగళూరు: కరోనా నెగిటివ్‌ను ధృవీకరించే ఆర్టీపీసీఆర్ చెల్లుబాటు నిమిషం ముందు ముగిసింది. దీంతో ఒక కుటుంబాన్ని విమానంలోకి ప్రవేశించనీయలేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. భారత్ నుంచి దుబాయ్‌కి వెళ్లే విమాన ప్రయాణికులు 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌ను వెంట తీసుకెళ్లాలి.
కాగా, ముగ్గురు సభ్యులున్న ఒక కుటుంబం వార్షిక సెలవుల నిమిత్తం అక్టోబర్‌లో బెంగళూరును సందర్శించింది. 39 ఏండ్ల సుహైల్ సయ్యద్, గర్భవతి అయిన 28 ఏండ్ల భార్య రుక్సర్ మెమన్, 63 ఏండ్ల తల్లి ముంతాజ్ మునవర్, దుబాయ్‌కు వెళ్లేందుకు మంగళవారం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే ఆదివారం వారు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ గడువు మధ్యాహ్నం 1.15కు ముగిసింది. ఆ గడువుకు ముందే వారు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పటికి దుబాయ్‌కు వెళ్లే విమానంలోకి ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిరాకరించారు.
కాగా, ఫార్మాల్టీల పేరుతో సిబ్బంది మూడు గంటలు ఆలస్యం చేశారని, దీంతో ఆర్టీపీసీఆర్ గడువు ఒక నిమిషమే ముగిసినా ప్రయాణానికి తమను అనుమతించలేదని ఆ కుటుంబం ఆరోపించింది. వెంటనే విమానాశ్రయంలో రూ.3,000లు చొప్పున చెల్లించి ఆర్టీ-పీసీఆర్ రాపిడ్ టెస్ట్ చేయించుకున్నప్పటికీ విమానం ఎక్కనీయలేదని విమర్శించారు.
మరోవైపు ఈ ఘటన దురదృష్టకరమని ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొంది. బాధితులకు అయిన అదనపు ఖర్చులకు తగిన పరిహారం అందజేస్తామని ఆ సంస్థ ప్రకటించింది.