Dead bodies mix : సిబ్బంది నిర్లక్ష్యంతో ఢిల్లీ (Delhi) లోని సంజయ్‌గాంధీ ఆస్పత్రి (Sanjay Gandhi Hospital) మార్చురీలో మృతదేహాలు మారాయి. ఒక బాడీకి బదులుగా మరో బాడీ ఇవ్వడంతో ఓ కుటుంబం తమ కుటుంబానికి చెందిన వ్యక్తికి బదులుగా మరో వ్యక్తికి అంత్యక్రియలు చేసింది. అంత్యక్రియలు పూర్తైన వ్యక్తి కుటుంబసభ్యులకు మార్చురీలో మృతదేహం కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ప్రేమ్ నగర్‌కు చెందిన పంకజ్ కుమార్ (40) బుధవారం బిల్డింగుపై నుంచి జారీ కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ పంకజ్ కుమార్ మృతిచెందాడు. దాంతో పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.
అదే సమయంలో నంగ్లోయ్ ప్రాంతానికి చెందిన భరత్ భూషణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మార్చురీకి తరలించారు. భరత్‌భూషణ్ కుటుంబం మృతదేహం కోసం వెళ్లగా వారికి పంకజ్ కుమార్ మృతదేహాన్ని అందించారు. అప్పటికే చీకటి పడటంతో భూషణ్ కుటుంబం మృతదేహాన్ని తెరచి చూడకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించింది.
మరుసటి రోజు ఉదయాన్నే పంకజ్ కుమార్ కుటుంబసభ్యులు మృతదేహం కోసం వెళ్లారు. మార్చురీ అంతా చూసిన అతడి మృతదేహం లభించకపోవడంతో వారు మార్చురీ సిబ్బందిని నిలదీశారు. దాంతో వారు రికార్డుల ప్రకారం పరిశీలించగా భరత్ భూషణ్ మృతదేహం మార్చురీలోనే ఉంది. దాంతో భరత్ భూషణ్ కుటుంబానికి పంకజ్ కుమార్ మృతదేహాన్ని ఇచ్చినట్లు వెల్లడయ్యింది.
దాంతో పంకజ్ కుమార్ కుటుంబం ఆస్పత్రి నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక డీసీపీకి కూడా రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చింది. దాంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.