కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో (RG Kar rape-murder case) తనను తప్పుగా ఇరికించారని నిందితుడు సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. ఈ నేరం తాను చేయలేదని చెప్పాడు. ఈ నేరానికి పాల్పడిన వారిలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు కోర్టుకు వెల్లడించాడు. శనివారం సీల్దాలోని సీబీఐ కోర్టు ఈ కేసుపై తీర్పు ఇచ్చింది. పోలీస్ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. కోర్టులో ప్రవేశపెట్టిన నిందితుడిని ఉద్దేశించి ‘నీకు శిక్ష పడాలి’ అని న్యాయమూర్తి అన్నారు.
కాగా, తాను ఈ నేరానికి పాల్పడలేదని నిందితుడు సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. నేరానికి పాల్పడిన వారిని విచారించలేదని ఆరోపించాడు. ‘నన్ను తప్పుగా ఇరికించారు. నేను ఈ నేరం చేయలేదు. హత్యాచారం చేసిన వారిని వదిలివేస్తున్నారు. ఇందులో ఒక ఐపీఎస్ కూడా ఉన్నారు’ అని కోర్టుకు చెప్పాడు.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్, సీబీఐ సాక్ష్యాల ఆధారంగా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా సీల్దా కోర్టు నిర్ధారించింది. సోమవారం శిక్షలు ఖరారు చేస్తామని ప్రకటించింది. అయితే ఆ రోజు కేసు విచారణ సందర్భంగా మాట్లాడేందుకు నిందితుడికి అనుమతిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
కాగా, సంజయ్ రాయ్‌పై నమోదైన కేసుల సెక్షన్లు, మోపిన అభియోగాలు, సీబీఐ వాదనల మేరకు దోషిగా తేలిన అతడికి సీబీఐ కోర్టు మరణ శిక్ష విధించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.