న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: తన కుమారుని వీరమరణానికి గుర్తింపుగా సర్కారు పంపిన మూడో అతిపెద్ద సైనిక పురస్కారాన్ని ఓ తండ్రి తిరస్కరించాడు. గౌరవప్రదంగా రాష్ట్రపతి భవన్లో రిపబ్లిక్ దినోత్సవమో, స్వాతంత్య్రం దినోత్సవమో పురస్కరించుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయాల్సిన మెడల్‌ను పోస్టులో పంపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్ముకశ్మీర్‌లో ఐదేండ్ల క్రితం ఉగ్రవాదులతో పోరాడుతూ కన్నుమూసిన లాన్స్ నాయక్ గోపాల్‌సింగ్ భదోరియాకు సర్కారు మూడో అతిపెద్ద సైనిక పురస్కారమైన శౌర్యచక్రను ప్రకటించింది. అయితే లాంఛనంగా జరిగే పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా పోస్టులో పంపడం తన కుమారుని స్మృతిని అవమానించడమేనని తండ్రి మునీంసింగ్ అన్నారు. ఆయన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌లో నివాసముంటున్నారు. అవార్డును పోస్టులో పంపడం వెనుక కుటుంబ తగాదాలున్నాయి. అమర జవాన్ లాన్స్ నాయక్ సింగ్ తన భార్యతో విడిపోయాడు. కోర్టులో వ్యవహారం నడిచింది. తీర్పు వెలువడే లోగా ఆయన కశ్మీర్లో ప్రాణాలు వదిలాడు. తమ కుమారునితో విడిపోయిన కోడలు ఆ అవార్డు, దానితోపాటే ఇచ్చే ఇతర పారితోషికాలు అందుకోవడానికి వీల్లేదంటూ మునీంసింగ్ కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నాడు. ఈ లోగా విడాకుల కేసులో తీర్పు వచ్చింది. దీంతో అవార్డును రాష్ట్రపతి భవన్లో తనకే ఆందజేయాలని ఆయన కేంద్రానికి లేఖలు రాశాడు. కానీ కేంద్ర ప్రభుత్వం పోస్టులో పంపింది.