పూర్ణియా, జూన్ 10: బీహార్లోని ఒక గ్రామంలో ఏకంగా ఒక నకిలీ పోలీస్ స్టేషనే ఏర్పాటు చేసి కొన్ని నెలల పాటు యథేచ్ఛగా నడిచినా పట్టించుకున్న వారే లేకుండా పోయారు. దాని నిర్వాహకుడు ఎడాపెడా ఫైన్లు విధించి స్థానికులను దోచుకుని పరారయ్యాడు. బీహార్లోని పూర్ణియా జిల్లాలోని మోహనీ గ్రామంలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. రాహుల్ కుమార్ అనే మోసగాడు ఒక స్కూల్లో దానిని ఏర్పాటు చేశాడు.
గ్రామీణ రక్షక దళం పేరిట నియామకాలు చేపట్టి ఒక్కొక్కరి నుంచి 25 వేల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేశాడు. అలా నియమించిన వారికి యూనిఫామ్లు, లాఠీలు, ఐడీ కార్డులు వంటివి ఇచ్చి ఊరిపై దాడులకు పంపేవాడు. వారు సారా స్మగ్లర్లు, ఇతర సంఘ విద్రోహులపై దాడులు నిర్వహించి భారీగా జరిమానాలు వసూలు చేసేవారు.