భోపాల్: ఒక నకిలీ డాక్టర్ పలువురు రోగులకు గుండె ఆపరేషన్లు చేశాడు. అయితే ఒకే నెలలో ఏడుగురు మరణించారు. దీంతో ఆ డాక్టర్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపగా అతడు నకిలీ డాక్టర్ అని తేలింది. (Fake Doctor Heart Surgeries) మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా చెప్పుకున్నాడు. అదే పేరున్న ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడిగా ధృవీకరణ పత్రాలు సృష్టించాడు. దామోహ్‌లోని క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు రోగులకు హార్ట్ సర్జరీలు చేశాడు.
కాగా, గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగుల్లో ఒకే నెలలో ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డాక్టర్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో న్యాయవాది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దీపక్ తివారీ ఆ డాక్టర్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. సర్జరీ తర్వాత మరణించిన రోగుల మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.
మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశంతో దర్యాప్తు బృందం ఆ క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిని సందర్శించింది. అక్కడున్న అన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ బ్రిటీష్ వైద్యుడు ఎన్ జాన్ కెమ్ పేరుతో అతడు నకిలీ పత్రాలు సమర్పించినట్లు తెలుసుకున్నారు.
కాగా, నకిలీ డాక్టర్ అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లో క్రిమినల్ కేసు నమోదుతో సహా పలు వివాదాల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ నకిలీ డాక్టర్‌తోపాటు రోగుల మరణాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.