ముంబై, డిసెంబర్ 19: శివసేనలో తిరుగుబాటును ప్రోత్సహించి మహారాష్ట్రలో ఉద్దశ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసిన బీజేపీ ఇప్పుడు తన అసలు రంగును బయటపెట్టింది. శివసేన చీలికవర్గం నాయకుడు, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండేకు బేషరతుగా మద్దతునిస్తామంటూ ప్రభుత్వంలో చేరిన బీజేపీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలని డిమాండ్ చేస్తున్నది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే అన్నారు. ఫడ్నవీస్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాగపూర్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో బవాంకులే మాట్లాడుతూ.. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నంత కాలం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నారు. తాము మెజారిటీగా ఉన్నందున ఫడ్నవీస్‌ను సీఎంను చేయాలని కోరడం లేదని, మహారాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకే కోరుతున్నామని చెప్పారు.
అసెంబ్లీలో బీజేపీకి అత్యధిక మంది ఎమ్మెల్యేలున్నారని, షిండేకు పాలించడం చేతకావడం లేదని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఏక్నాథ్ షిండే వర్గంలో కలకలం మొదలైంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బవాంకులే వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నది. అధికార కూటమి ఐక్యంగా ఉండాలని సూచిస్తున్నది. బవాంకులే వ్యాఖ్యలను బట్టి.. షిండే నాయకత్వం బీజేపీకి ఇష్టం లేనట్టు తెలుస్తున్నదని ప్రతిపక్ష ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ అన్నారు.