Fact Check | కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్దిగంటల్లోనే పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడటంతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే జమ్ములోని నగ్రోటా వద్ద సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి దిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఇండియన్ ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చిన దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని.. అయితే అప్రమత్తమైన భారత జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని పీఐబీ ఖండించింది.
ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చిన పలువురు టెర్రరిస్టులు నగ్రోటాలో దాడులకు పాల్పడ్డారనే వార్తల్లో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ద్వారా నిర్ధారించింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని.. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక సంస్థలనే ఫాలో అవ్వమని తెలిపింది.
ఇదిలా ఉంటే సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్లు దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్(ఎక్స్) వేదికగా తెలిపారు. కాల్పుల విరమణ సంగతేంటని ప్రశ్నించారు. శ్రీనగర్‌తో పాటు ఉధంపూర్‌లో కూడా భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, బాడ్మేర్లో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. కథువాలో బ్లాక్అవుట్ పాటిస్తున్నారు.