న్యూఢిల్లీ: భార్య వేధింపులను తాళలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్న కేఫ్ యజమాని పునీత్ ఖురానా (40) రికార్డు చేసిన చిట్టచివరి వీడియో సంచలనంగా మారింది. ఆయన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఈ వీడియోను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసినట్లు తెలుస్తున్నది. ఈ వీడియో నిడివి 54 నిమిషాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. దీనిలో రెండున్నర నిమిషాల క్లిప్ గురువారం బయటకు వచ్చింది. దీనిలో పునీత్ మాట్లాడుతూ, తన భార్య, మామయ్య, ఆమె తరపు బంధువులు తనను తీవ్రంగా హింసించి, వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా, అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని తనను వేధించారని తెలిపారు. తాను మానసికంగా కుంగిపోయానని, ఇదే తన చివరి స్టేట్మెంట్ అని తెలిపారు. ఆయన మంగళవారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పునీత్ భార్యను, ఆమె తండ్రిని ప్రశ్నించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పునీత్ మొబైల్ ఫోన్‌ను ఆయన మామయ్య త్రిలోక్‌నాథ్ తమకు అప్పగించారని పోలీసులు చెప్పారు.