Indian Students | న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఉన్నత చదువుల కోసం అమెరికా, కెనడాల్లో అడుగుపెడుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ ఊహించని పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ నకిలీ ఏజెంట్లు చేస్తున్న మోసాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బలవుతున్నారు. నకిలీ అడ్మిషన్ లెటర్స్‌తో తమ దేశానికి వచ్చారని వందలాది మంది భారతీయ విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో 28 మంది భారతీయ విద్యార్థులపై అమెరికా బహిష్కరణ వేటు వేసింది. ఈ సమస్య అమెరికాకేగాక, కెనడాలోనూ మొదలైంది. వందలాది మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు వేసేందుకు కెనడా అధికారులు రంగం సిద్ధం చేశారు.
అయితే, దీనిపై భారత విదేశాంగ అధికారులు స్పందిస్తూ..ఏజెంట్లు చేసిన మోసాలకు విద్యార్థులను బలి చేయవద్దని అమెరికా, కెనడా ప్రభుత్వాలను కోరుతున్నది. ఈ అంశంపై కేంద్ర సహాయ మంత్రి వి మురళీధరన్ లోక్‌సభలో మాట్లాడుతూ, ‘ఈ సమస్యకు ముఖ్య కారణం నకిలీ ఏజెంట్లని మేం గుర్తించాం. కేంద్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆయా కేసులతో సంబంధమున్న నకిలీ ఏజెంట్లను, సంస్థలను గుర్తించే పని చేపట్టాం. బహిష్కరణ వేటు పడ్డ కొంతమంది విద్యార్థులు అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ సమస్యను కెనడాతో దౌత్య మార్గంలో పరిష్కరించే ప్రయత్నం భారత్ చేస్తున్నది’ అని చెప్పారు. ‘చెల్లుబాటు అయ్యే స్టూడెంట్ వీసాలను కలిగిఉన్న వారి విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అమెరికాను కోరాం. అక్కడి అధికార యంత్రాంగంతో నిరంతరం టచ్‌లో ఉన్నాం’ అని అన్నారు.