న్యూఢిల్లీ: బాలల అభివృద్ధి చెందుతున్న మెదడుపై గాలి కాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల భాష అభివృద్ధి, జ్ఞాపకశక్తి, మనఃస్థితి నియంత్రణలకు నష్టం జరుగుతుంది. గాలి కాలుష్యం వల్ల పర్టిక్యులేట్ మ్యాటర్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వంటి హానికర పదార్థాలు పర్యావరణంలో వ్యాపిస్తాయి. అమెరికాలోని ఒరెగావ్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి చెందిన ఫిజిషియన్-సైంటిస్ట్‌ల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గాలి కాలుష్యానికి గురైతే, కౌమార దశలోని వ్యక్తి మెదడులో మౌలిక శారీరక మార్పులు జరుగుతాయి.
మెదడులో కార్యకలాపాల నిర్వహణ, భాష, మనఃస్థితి నియంత్రణ, సామాజిక భావోద్వేగ సమాచారాన్ని గ్రహించి, అర్థం చేసుకుని, స్పందించే ప్రక్రియ జరిగే ప్రాంతాలపై ప్రభావం పడుతుంది. బాలల ఆరోగ్యం, సంక్షేమం, జీవన గమనంపై ఈ మార్పుల ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరించారు.
ఈ అధ్యయన నివేదిక ప్రధాన రచయిత కెల్విన్ జారా మాట్లాడుతూ& మెదడుపై నెమ్మదిగా, సూక్ష్మంగా పడుతున్న ప్రభావాన్ని తాము గుర్తించామని చెప్పారు. వీటి లక్షణాలు తక్షణమే కనిపించకపోవచ్చునన్నారు. కానీ వీటి ఫలితంగా శారీరక, మానసిక, జ్ఞాన సంబంధమైన అభివృద్ధి ప్రక్రియలో కాలం గడిచే కొద్దీ మార్పులు వస్తాయని చెప్పారు. ఈ అధ్యయనంలో సుమారు 11,000 మంది బాలల సమాచారాన్ని విశ్లేషించారు. ‘ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్’ జర్నల్‌లో ఈ నివేదిక ప్రచురితమైంది.