చండీగఢ్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. (missile debris) సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పంజాబ్లో బుధవారం రాత్రివేళ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు.
కాగా, గురువారం ఉదయం అమృత్సర్ పరిధిలోని పలు గ్రామాల్లో క్షిపణి శిథిలాలు కనిపించాయి. వీటిని చూసి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. జెతువాల్, మఖన్ విండి, పంధేర్లోని పొలాల్లో కనిపించిన క్షిపణి శిథిలాలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బిల్డింగులపై కూడా క్షిపణి శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉనట్లు గుర్తించారు. పాక్ ప్రయోగించి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నడంతో పంజాబ్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.