న్యూఢిల్లీ, మే 31: దేశంలోని విద్యావ్యవస్థ తీరుపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో విద్య అనేది పెద్ద పరిశ్రమగా మారిపోయిందని, మెడికల్ కోర్సులకు ఉన్న అధిక ఫీజుల కారణంగానే విద్యార్థులు వైద్యవిద్య కోసం ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్తున్నారని పేర్కొన్నది.
రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్పై దాదాపు 20 వేల మంది విద్యార్థులు అష్టకష్టాలు పడి దేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. కొత్త ఫార్మసీ కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫార్మసీ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో కొత్త కళాశాలల ఏర్పాటుపై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) 2019లో ఐదేండ్ల పాటు నిషేధం విధించింది.