West Bengal | పశ్చిమ బెంగాల్ సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సంస్థ టుడేస్ చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. అది కూడా పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందనేది టుడేస్ చాణక్య అంచనా. 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 192 సీట్లు గెలుచుకుంటుందని ఈ సంస్థ వెల్లడించింది. అధికార టీంఎసీకి దాదాపు వంద సీట్లు వచ్చే అవకాశం ఉంది.
టీఎంసీకి, బీజేపీకి ఈ అంచనాల్లో 11 సీట్లు అటూఇటుగా రావొచ్చు. రెండు స్తానాలు ఇతర పార్టీలకు లేదా స్వతంత్రులకు వచ్చే అవకాశం ఉంది. ఇవి ఎన్నికల తర్వాత వెల్లడైన అంచనాలు. బెంగాల్లో అధికారం చేపట్టాలంటే 148 సీట్లు రావాలి. తాజా అంచనా ప్రకారం.. బీజేపీకి మెజారిటీకి మించి సీట్లు వస్తాయి. దీంతో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మమతా బెనర్జీకి ఓటమి తప్పకపోవచ్చు. ఇక తమిళనాడుకు సంబంధించి ఇదే సంస్థ అంచనా ప్రకారం డీఎంకే అధికారం చేపట్టే అవకాశాలున్నాయి.
234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే కూటమికి దాదాపు 125 సీట్లు రావొచ్చు. అంటే స్పష్టమైన మెజారిటీ. అలాగే, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 63 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుంది. ఇక ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 45 సీట్లకు పరిమితం కావొచ్చు. మరోవైపు టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. తమ పార్టీ 226 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.