Airship | హైదరాబాద్, నవంబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘ఊయల ఊగి.. ఊగి.. ఉన్నచోటుకే వస్తుందంటారు’.. ఎయిర్‌షిప్ వాడకంలోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నట్టు కనిపిస్తున్నది. ఏడెనిమిది దశాబ్దాల కిందటివరకూ వినియోగించిన ఎయిర్‌షిప్‌లను విమానాల స్థానంలో మళ్లీ తీసుకురావడానికి పెద్దయెత్తున కసరత్తు ప్రారంభమయ్యింది.
తిమింగళం ఆకారంలో హైడ్రోజన్ వాయువుతో నిండిన బెలూన్ ద్వారా సుదూర ప్రాంతాలకు మనుషులను, సరుకులను రవాణా చేయడానికి వినియోగించే విహంగ నిర్మాణమే ఎయిర్‌షిప్. గాలి కంటే తక్కువ బరువు ఉండే హైడ్రోజన్ వాయువును ఎయిర్‌షిప్ బెలూన్‌లో తొలుత వాడేవారు. అయితే, హైడ్రోజన్‌కు మండే స్వభావం ఎక్కువగా ఉండటంతో ఆ తర్వాత హీలియంను వినియోగించారు.
వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాల కారణంగా భూతాపం పెరిగిపోతున్నది. 2.5 శాతం కర్బన ఉద్గారాలు విమానాల కారణంగానే విడుదల అవుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ ఉద్గారాల కారణంగా వాతావరణ మార్పులు జరిగి ధ్రువప్రాంతాల్లో మంచు కరిగి, సముద్ర జలాలు వేడెక్కి జీవావరణానికే ముప్పు వాటిల్లే దుస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే విమానాల స్థానంలో ముఖ్యంగా కార్గో విమానాలకు ప్రత్యామ్నాయంగా ఎయిర్‌షిప్‌లను తీసుకురావాలని శాస్త్రవేత్తలు కసరత్తు ప్రారంభించారు.
ఎయిర్‌షిప్‌ల వాడకంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అందులో మొదటిది వీటిలో ఇంధనంగా వాడే హీలియం లభ్యత. భూమిపై హీలియం లభ్యత తక్కువగా ఉన్నది. 1 కిలో సరుకును మోయడానికి 1 క్యూబిక్ మీటర్ హీలియం అవసరమవుతుంది. దీనికి రూ. 3 వేల వరకూ వెచ్చించాల్సి రావొచ్చు. ఇది ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. ఇక మరో ప్రధాన సమస్య.. సరుకు రవాణా జరిగేప్పుడు ఎలాంటి అవాంతరాలు కలుగనప్పటికీ, సరుకును ఎయిర్షిప్లోకి ఎక్కించడం, దించడం సమయంలో సదరు వాహకనౌక బరువును సమతుల్యంతో (బ్యాలెన్స్డ్గా) నిలపగలగాలి. లేకపోతే అది కూలిపోయే ప్రమాదం ఉన్నది. వేగం కూడా ఇంకో సమస్యగా మారింది. అయితే, వీటికి తగిన పరిష్కారాలను కనుగొనే పనిలో ఉన్నట్టు పలువురు నిపుణులు చెప్తున్నారు.
సరికొత్త ఎయిర్‌షిప్‌ల తయారీకి ఇప్పటికే పలు కంపెనీలు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లయింగ్ వేల్స్ అనే కంపెనీ ఫ్లయింగ్ క్రేన్ పేరిట 200 మీటర్ల పొడువున్న ఎల్సీఏ60టీ హీలియమ్ ఎయిర్‌షిప్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. రాకెట్ విడి భాగాలు, పవర్‌లైన్ టవర్లు, టర్బైన్ బ్లేడ్లు, ఏజెన్సీ ఏరియాలకు తాత్కాలిక దవాఖాన భవనాలు, కర్మాగారాలకు అడవుల నుంచి కలప తదితర రవాణాకు దీన్ని వినియోగిస్తున్నారు. ఏరోస్ అనే మరో కంపెనీ కూడా ఈ తరహా ఎయిర్షిప్నే అందుబాటులోకి తీసుకొచ్చింది.
1937 మే 6న అమెరికాలో ‘హిండెన్‌బర్గ్ ఎయిర్‌షిప్ ప్రమాదం’ జరిగింది. ఈ ఘటనలో 36 మంది మరణించారు. హైడ్రోజన్ గ్యాస్ లీకవ్వడం, అప్పుడే ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జీ సిస్టమ్‌లో చిన్న నిప్పురవ్వలు ఏర్పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఎయిర్‌షిప్‌ల వినియోగాన్ని పెద్దమొత్తంలో తగ్గించారు. అలాగే విమానాలతో పోలిస్తే వేగంలో ఎయిర్‌షిప్‌లు వెనుకబడటంతో క్రమంగా ఇవి కనుమరుగయ్యాయి.