న్యూఢిల్లీ: గణేశ్ ఉత్సవాల సమయంలో.. ప్రధాని మోదీ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud) ఇంట్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ పూజపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో సీజే చంద్రచూడ్ రియాక్ట్ పరోక్షంగా అయ్యారు. లోక్‌సత్తా వార్షిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. అలాంటి సమావేశాల్లో న్యాయపరమైన అంశాలను చర్చించమన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించడం సాధారణ ప్రక్రియ అని పేర్కొన్నారు.
జుడిషియర్, ఎగ్జిక్యూటివ్ అధికారుల మధ్య జరిగే సమావేశాల్లో న్యాయపరమైన అంశాలను సంభాషించబోమని, కానీ పరిపాలనా, సామాజిక అవసరాల కోసం ఆ మీటింగ్‌లు నిర్వహించనున్నట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. ఆ భేటీల ద్వారా తామేమీ డీల్స్ చేయబోమన్నారు. జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అధికారుల మధ్య సమావేశం జరిగితే, ఆ సమయంలో ఏదో ఒప్పందం జరిగినట్లు భావిస్తారని, కానీ అలాంటిది ఏమీ ఉండదన్నారు.
ప్రభుత్వానికి చెందిన రెండు శాఖల మధ్య సంప్రదింపుల్లో భాగమే ఆ భేటీ అని సీజే తెలిపారు. న్యాయవ్యవస్థకు రాష్ట్రాలే బడ్జెట్‌ను కేటాయిస్తాయని, అయితే ఆ బడ్జెట్‌ను జడ్జీల కోసం కేటాయించరని, కొత్త కోర్టు బిల్డింగ్లు, న్యాయమూర్తులకు నివాసాలు కావాలని, దాని కోసం సీఎంలతో చీఫ్ జస్టిస్‌లు కలుస్తారని సీజే చంద్రచూడ్ తెలిపారు.