Hafiz Saeed | న్యూఢిల్లీ: లష్కర్ తాయిబానా? ఆ సంస్థ ఉనికే మా దేశంలో లేదు. ఇక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సంస్థ పేరు కూడా ఎక్కడా వినలేదు. అంటూ రెండు రోజుల క్రితం అంతర్జాతీయ మీడియా సమక్షంలో నిస్సిగ్గుగా అబద్ధమాడేశారు పాకిస్థాన్ మంత్రి ఒకరు. అయితే పహల్గాంలో పర్యాటకులపై పాశవిక దాడి వెనుక లష్కర్ తాయిబా హస్తం ఉన్నట్టు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి.
ఈ దాడి తామే చేశామంటూ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినా దాని వెనుక ప్రధాన హస్తం లష్కరే తాయిబాదే. దాని చీఫ్, భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్యే ఈ దాడికి సూత్రధారి అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హఫీజ్ పాక్లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా దర్జాగా జీవిస్తున్నట్టు ఒక ఆంగ్ల మీడియా తన కథనంలో పేర్కొంది. హఫీజ్ సయీద్ లాహోర్లోని జోరమ్ తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రదేశంలో సామాన్య పౌరులతో కలిసి జీవిస్తున్నట్టు తెలిసింది.