న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుందని, ఒకట్రెండు రోజుల్లో ఈ దశ మొదలు కావొచ్చని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే కేసుల వృద్ధి దశ సాపేక్షంగా తక్కువ కాలమే ఉన్నప్పటికీ, ఉద్ధృతి ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కొవిడ్-19 ఇండియా ట్రాకర్ ఆధారంగా వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 24నాటికి ఆరు రాష్ర్టాల్లో కేసుల పెరుగుదల (వృద్ధి రేటు 5 శాతం కంటే ఎక్కువ) ఆందోళన కలిగించేలా ఉండగా.. ప్రస్తుతం 11 రాష్ర్టాల్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంచనాలకు తగ్గట్టే!
దేశంలో సెకండ్‌వేవ్ మేలో పీక్స్టేజీలోకి వెళ్తుందని, వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో ఆగస్టులో కేసులు తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇండియా ట్రాకర్ ముందుగానే కచ్చితమైన అంచనాలు వేసింది. దానికి తగ్గట్టే ఆగస్టులో కేసులు తగ్గుముఖం పట్టాయి.
రోగనిరోధక శక్తి నుంచి ఒమిక్రాన్ తప్పించుకోగలదు!
ఒమిక్రాన్ వేరియంట్ రోగనిరోధక శక్తి నుంచి అత్యంత సులభంగా తప్పించుకోగలదని కరోనాపై ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ వెల్లడించింది. డెల్టా, ఇతర వేరియంట్లతో పోలిస్తే, ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉన్నట్టు ప్రాథమిక అంచనాల్లో తేలిందని, అయితే, కొత్త వేరియంట్‌తో ముప్పు తీవ్రత అంచనా వేసినదానికంటే చాలా ఎక్కువగానే ఉన్నట్టు హెచ్చరించింది.
అగ్రరాజ్యంలో కరోనా ఉగ్రరూపం
అమెరికాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. 24 గంటల వ్యవధిలో 4.4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికిపైగా ఒమిక్రాన్ కేసులే. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గతవారం 11% పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
మోదీ యూఏఈ పర్యటన వాయిదా!
ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ యూఏఈ పర్యటన వాయిదా పడినట్టు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం జనవరి 6న మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నది.
ఢిల్లీ, ముంబైలలో భారీగా కేసులు
దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో కరోనా రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ముం బైలో బుధవారం ఒక్కరోజే 2,510 కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే (1,377) ఇవి 82 శాతం అధికం. ఢిల్లీలో బుధవారం 923 కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే ఇవి 86 శాతం అధికం.
ఒమిక్రాన్‌ను అడ్డుకునే యాంటిబాడీలు
ఒమిక్రాన్‌తో పాటు అన్ని రకాల కరోనా వేరియంట్లను నిలువరించే యాంటిబాడీలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఈ యాంటిబాడీల ప్రత్యేకత. వైరస్ల జన్యుపరివర్తనంలో స్పైక్ ప్రొటీన్ కీలకం. ఈ యాంటిబాడీలు నేరుగా దానిపైనే ప్రభావం చూపడం వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.