న్యూఢిల్లీ, మే 30: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరో వివాదంలో చిక్కుకున్నది. దేశవ్యాప్తంగా అనేక కేంద్రాల్లో శనివారం కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్(సీయూఈటీ-యూజీ)- 2026 ఆలస్యంగా నిర్వహించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కొత్త రాజకీయ సెగ తగిలింది.మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష సాయంత్రం 4 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. దీంతో విద్యార్థులు గంట సేపు పరీక్ష కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఆలస్యానికి సాంకేతిక లోపం కారణమని ఎన్టీఏ తర్వాత వివరణ ఇచ్చింది. తమకు ప్రధానంగా సేవలందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నివేదించిన సాంకేతిక లోపం కారణంగానే పరీక్ష నిర్వహణలో ఆలస్యం జరిగినట్టు తెలిపింది. పరీక్ష ఆలస్యంపై విపక్షలు విరుచుకు పడ్డాయి. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో అవకతవకలకు సీయూఈటీ ఆలస్యం మరో ఉదాహరణ అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొదట నీట్, తర్వాత సీబీఎస్ఈ, ఇప్పుడు సీయూఈటీ అని ఎక్స్ వరుస పోస్టుల్లో ఆమె వ్యాఖ్యానిస్తూ నీట్ యూజీ పేపర్ లీక్, సీబీఎస్ఈకి చెందిన 12వ తరగతి మార్కింగ్ విధానం చుట్టూ అలుముకున్న వివాదాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇదే విధమైన వాదనను వినిపిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) పరీక్షలు కూడా దుర్వినియోగం, అవినీతికి మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. నీట్, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ, ఈరోజు సీయూఈటీ. నాలుగు పరీక్షలు. కోటి మంది పిల్లలు. ఒక్కటి కూడా నిజాయితీగా నిర్వహించలేదు అని ఎక్స్ పోస్టులో రాహుల్ పేర్కొన్నారు. మీరు ఏ తరం భవిష్యత్తును నాశనం చేస్తున్నారో అదే తరం మిమల్ని జవాబుదారీగా నిలబెడుతుంది అని హెచ్చరించారు.
3,765 మందికి మళ్లీ రాసే అవకాశం
సాంకేతిక లోపం కారణంగా శనివారం పరీక్ష షిఫ్ట్ 1 ప్రారంభం ఆలస్యం కావడంతో తమ పరీక్షా కేంద్రాలను విడిచి వెళ్లిన 3,700 మందికి పైగా సీయూఈటీ(యూజీ) 2026 అభ్యర్థులకు, అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షకు తిరిగి హాజరయ్యేందుకు ఒకే ఒక్క అవకాశం మళ్లీ ఇవ్వనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. అంతరాయం తర్వాత ప్రభావిత కేంద్రాల్లో పరీక్ష సమయాలను సవరించామని, పరీక్షలు తిరిగి ప్రారంభమయ్యాక చాలా మంది అభ్యర్థులు(సుమారు 95 శాతం) తమ పరీక్షను పూర్తి చేయగలిగారని ఎన్టీఏ తెలిపింది.