Mimi Chakraborty : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన నిరసన ప్రదర్శనలో టీఎంసీ మాజీ ఎంపీ, నటి మిమీ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిమీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఈ వ్యవహారంలో సత్వర న్యాయం కావాలని మహిళలు, సోదరులు కోరుతున్నారని చెప్పారు.
కోల్కతా ఇలాంటి నేరాలకు అడ్డా కాదని, వీటిని సభ్యసమాజం ఆమోదించదని మిమీ చక్రవర్తి స్పష్టం చేశారు. ఇక ఈ కేసులో సత్వర విచారణ చేపట్టి నిందితుడిని వెంటనే ఉరితీయాలని తాను కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇంతటి హేయమైన నేరానికి పాల్పడిన నిందితుడిని ఉరితీయాలని ఆమె పేర్కొన్నారు.
తమ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలకు సంబంధించి అన్ని పత్రాలను సీబీఐకి అప్పగించామని వెల్లడించారు. ఎలాంటి సమాచారం, ఆధారాలను బహిర్గతం చేయలేదని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి తనతో పాటు, బెంగాల్ ప్రజల సానుభూతి ఉందని అన్నారు. ఇది చాలా పెద్ద నేరం, నిందితుడిని ఉరితీయడమే సరైన శిక్ష అని స్పష్టం చేశారు. దోషిని ఉరితీస్తేనే దాన్నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని చెప్పారు. అయితే ఏ ఒక్క అమాయకుడినీ శిక్షించరాదని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
Read More :
Deputy CM Pawan Kalyan | క్యూట్.. కూతురితో సెల్ఫీ దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్