Shivraj Singh Chouhan | భోపాల్, జూన్ 22: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో విదిశ స్థానం నుంచి శివరాజ్ బంపర్ మెజార్టీతో విజయం సాధించడంతో ‘ఢిల్లీ మొత్తం నా తండ్రి ముందు తలవంచింది’ అంటూ వ్యాఖ్యానించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా చాలా పాపులర్ వ్యక్తి అని, ఆయన సీఎంగా లేకున్నా మరింత పాపులర్ అయ్యారని పేర్కొన్నారు. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భెరుండాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో కార్తికేయ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తన తండ్రికి మద్దతు పలికినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
‘ఒక సందేశం’ పంపడంలో బుద్ని ప్రజలు అద్భుతంగా పనిచేశారని అన్నారు. ‘అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా మన నాయకుడు(చౌహాన్) పాపులర్ వ్యక్తి. సీఎంగా లేకున్నా ఆయన మరింత పాపులర్ ఎందుకయ్యారో నాకు తెలియదు. ఇప్పుడు మన నాయకుడు భారీ విజయం సాధించిన తర్వాత.. ఈరోజున ఢిల్లీ మొత్తం ఆయన ముందు తలవంచింది’ అని కార్తికేయ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీ ఆయన్ను గుర్తించిందని, గౌరవించిందంటూ కేంద్రంలోని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని టాప్ లీడర్లలో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒకరని అన్నారు. కార్తికేయ సింగ్ వ్యాఖ్యల వీడియోను వివిధ పార్టీల నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ స్పందిస్తూ కార్తికేయ సింగ్ వ్యాఖ్యలను చూస్తే, బీజేపీలో అసమ్మతి భయం, పెద్ద నేతల తిరుగుబాటు భయం ఉన్నట్టు అర్థమవుతున్నదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తగ్గిపోతున్నదని, కుర్చీ కదిలిపోతున్నదని, ఢిల్లీ(కేంద్ర ప్రభుత్వం) భయపడుతున్నదని పేర్కొన్నారు.
గత ఏడాది ఆఖరులో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. రాష్ర్టానికి నాలుగుసార్లు సీఎంగా చేసిన చౌహాన్‌ను(బుధ్ని నుంచి గెలిచారు) పక్కనపెట్టి, మోహన్ యాదవ్‌ను రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మధ్యప్రదేశ్‌లోని విదిశ స్థానం కేటాయించింది. ఎన్నికల్లో ఆయన 8.2 లక్షలకు పైగా భారీ ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో శివరాజ్ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ మంత్రి పదవి దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ తాజా వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపాడుతున్నారు.