Divya Fahuja | మాజీ మోడల్ దివ్య పాహుజా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో హర్యానాలోని కాలువలో లభించింది. గురుగ్రామ్‌లోని హోటల్లో ఈ నెల ఒకటో తేదీన హత్యకు గురైన ఆమె మృతదేహాన్ని పంజాబ్ బాక్రా కెనాల్లో పడేస్తే.. హర్యానాలో కూరుకుపోయింది. సదరు మహిళ మృతదేహం వెలికి తీసిన తర్వాత.. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున గాలింపు చేపట్టారు. ఆమె హంతకుడికి సహాయకుడిగా ఉన్న బాల్‌రాజ్ గిల్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్‌లో హత్య జరిగితే 270 కి.మీ. దూరంలోని పాటియాలలో సదరు మృతదేహాన్ని కెనాల్లో పడేసినట్లు పోలీసుల విచారణలో బాల్‌రాజ్ గిల్ చెప్పాడు.
సదరు మాజీ మోడల్ దివ్య పాహుజా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆమె వీపుపై ఉన్న టాటూ ఆధారంగా ఆమెను గురుగ్రామ్ పోలీసులు గుర్తించారు. `టాటూ (పచ్చబొట్టు)ల ద్వారా మృతదేహాలను మేం గుర్తించగలం. కెనాల్లో దొరికిన మృతదేహంపై రెండు టాటూలు ఉన్నాయి. వాటిలో ఒక టాటూ డిజైన్ దివ్యా పాహుజా వీపుపై కనిపించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అటాప్సీకి, డీఎన్ఏ పరీక్షల కోసం మృతదేహాన్ని పంపాం` అని గురుగ్రామ్ పోలీసు అధికారి ముకేశ్ కుమార్ తెలిపారు.
దివ్యా పాహుజాను ఈ నెల ఒకటో తేదీన గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో హత్య చేసిన హంతకులు ఆమె మృతదేహాన్ని కారులో తరలిస్తున్న దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో కనిపించాయి. ఐదుగురు పురుషులు ఆమెను హోటల్‌కు తీసుకెళ్లారని, సదరు హోటల్ యజమానిని బ్లాక్ మెయిల్ చేసినందుకు ఆమె తలపై తుపాకీతో కాల్చి చంపి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని అభిజిత్ సింగ్ అర్ధ నగ్న ఫోటోలు, వీడియోలు ఆమె వద్ద ఉన్నాయని, వాటిని డిలిట్ చేయమని కోరినా ఆమె వినిపించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెను హత్య చేయాలని తన సహాయకుల్ని కోరినట్లు అభిజిత్ సింగ్ చెబుతున్నారు. కానీ ఈ ఆరోపణలను దివ్యా పాహుజా కుటుంబం నిరాకరించింది.
అభిజిత్ సింగ్‌కు ప్రవేశ్ అనే గ్యాంగ్‌స్టర్ తుపాకీ అందించాడని ఆరోపణలు వచ్చాయి. అభిజిత్ వద్ద నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అభిజిత్ సింగ్‌కు తుపాకీ అందించిన ప్రవేశ్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గురుగ్రామ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో 2016లో అరెస్టయిన దివ్యా పాహుజా జైలు పాలయ్యారు. గతేడాది జూన్‌లో బెయిల్ మీద బయటకు వచ్చారు.