Crime News : ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న భారత యువకులకు అధిక వేతనం ఆశచూపి, సైబర్ బానిసలుగా మారుస్తున్న మర్చంట్ నేవీ మాజీ అధికారి ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని, తాము ఇప్పుడు సైబర్ స్కామ్‌లో చిక్కుకున్నామని పలువురు యువకులు ఆగ్రా సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ సైబర్ నేరాల రాకెట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేశ్ కుమార్ అనే మాజీ మర్చంట్ నేవీ అధికారి కొన్నేళ్లుగా అంతర్జాతీయ సైబర్ బానిసత్వ ముఠాతో కలిసి పని చేస్తున్నాడు.
నాగేశ్ కుమార్ కంబోడియా, థాయ్‌లాండ్ దేశాల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను నమ్మించి, లక్షల రూపాయలను వారి నుంచి వసూలు చేశాడు. వారు అక్కడికి చేరుకున్న వెంటనే అక్కడి ముఠా సభ్యులు యువకుల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకొని, సైబర్ మోసాలు, ఆన్లైన్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేశాడు. అందుకు అంగీకరించని వారిని బంధించి ఆహారం పెట్టకుండా శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఈ వ్యవహారంపై యువకులు ఆగ్రా సైబర్ సెల్‌ను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.
యువకుల ఫిర్యాదుపై విచారణ జరిపిన సైబర్ సెల్ అధికారులు అనేకమంది భారత యువకులు ఈ రాకెట్లో చిక్కుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిని విదేశాలకు పంపిన నాగేశ్ కుమార్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపుర్‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరికి విదేశాలలోని మానవ అక్రమ రవాణా ముఠాలతో సంబంధమున్నట్లు గుర్తించామన్నారు. ఈ ముఠా సూత్రధారి ఆనంద్ కుమార్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. విదేశాల్లో చిక్కుకున్న భారత యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.