Videocon loan fraud case | వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ఎట్టకేలకు బయటకొచ్చారు. వీడియోకాన్ సంస్థకు అక్రమరీతిలో రుణాలు మంజూరు చేసిన కేసులో చందా కొచ్చార్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను డిసెంబర్ 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, అవినీతి కేసులో తమను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొచ్చర్ దపంతులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం వీరిద్దరినీ రిలీజ్ చేయాలని తీర్పు ఇచ్చింది.
కోర్టు ఆదేశాలతో లక్ష రూపాయాల బెయిల్ బాండ్‌పై ఆ ఇద్దర్ని విడిచిపెట్టారు.కుమారుడి పెళ్లి మరి కొన్ని రోజులు ఉందనగా కొచ్చర్ దంపతులు జైలు నుంచి విడుదలయ్యారు.. జనవరి 15వ తేదీన కొచ్చర్ దంపతుల కుమారుడి పెళ్లివేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.
చందా కొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3,200 కోట్లకుపైగా లోన్ తీసుకుంది. ఈ లోన్ మంజూరు సమయంలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీరిద్దరినీ డిసెంబర్ 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.