గువాహటి : అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కూతురు ప్రజోయిత కశ్యప్ తన కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టారు. మద్యం మత్తులో తనను తిట్టినందుకే అతడిని కొట్టానని ఆమె తెలిపారు. మోకాళ్లపై కూర్చొన్న ఓ వ్యక్తిని ఆమె దుర్భాషలాడుతూ చెప్పుతో కొట్టినట్టు ఒక వీడియో క్లిప్‌లో కనిపించింది. రాష్ట్ర రాజధాని దిస్పూర్లోని ఎమ్మెల్యే హాస్టల్లో పలువురు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. తాను దాడి చేసిన డ్రైవర్ తమ కుటుంబం దగ్గర చాలా కాలంగా పని చేస్తున్నాడని కశ్యప్ తెలిపింది. ‘అతడెప్పుడూ తాగి నాపై కామెంట్స్ చేస్తుంటాడు. ఇలా చేయొద్దని అతడికి చెప్పి చూశాం. కానీ అతడు వినలేదు. ఇవాళ అతడు పరిధి దాటి ప్రవర్తించి మా ఇంటి తలుపులు తట్టాడు’ అని ఆమె వెల్లడించారు. ఈ విషయమై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.