గురుదాస్‌పూర్: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఇవాళ ఉదయం హైడ్రామా చోటుచేసుకున్నది. ఇంప్రోవ్మెంట్ ట్రస్ట్ కాలనీ నెంబర్7లో సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. పంజాబ్ ఎక్స్ సర్వీస్‌మెన్ కార్పొరేషన్ ఉద్యోగి, మాజీ ఆర్మీ జవాను(Ex-Armyman).. బెదిరింపులకు పాల్పడడంతో భారీ సంఖ్యలో అక్కడకు పోలీసులు చేరుకున్నారు. తుపాకీతో కాల్పులు జరపనున్నట్లు ఆ వ్యక్తి బెదిరించడంతో స్థానిక పోలీసులు ఉలిక్కిపడ్డారు. కానీ చివరకు ఆ మాజీ ఆర్మీ ఉద్యోగి తన భార్యను, అత్తను షూట్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనకు చెందిన వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి భార్య, అత్తను మాజీ ఆర్మీ ఉద్యోగి చంపినట్లు తెలుస్తోంది. కుత్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత అతను ఐటీ కాలనీకి చేరుకున్నట్లు తెలిసింది. ఏకే-47 రైఫిల్‌తో ఓ వ్యక్తి కాలనీలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. తన వద్ద ఉన్న రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అరగంటలోనే భారీ సంఖ్యలో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిందితుడు గురుప్రీత్ సింగ్ దాక్కుకున్న ఇంటిని చుట్టుముట్టేశారు.
బుల్లెట్ ప్రూఫ్‌లు ధరించిన పోలీసులు అతని కోసం కాపు కాసారు. కాలనీ మొత్తం పోలీసుల్ని మోహరించారు. అయితే గురుప్రీత్‌తో ఎస్ఎస్పీ ఆదిత్య చర్చలు ప్రారంభించారు. సరెండర్ అయితే ఏం చేయబోమని హామీ ఇచ్చారు. కానీ గురుప్రీత్ దాన్ని నమ్మలేదు.తొలుత ఓ సారి ఫైరింగ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభించాలని పోలీసులు ప్రయత్నించారు. కానీ రెండో సారి గన్ శబ్ధం వినబడడంతో అతని వద్దకు వెళ్లారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
మాజీ ఆర్మీ జవాను ఎందుకు భార్యను, అత్తను చంపాడన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.