ముంబై, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, చంద్వాడ్‌లో ఒక ఆడియో క్లిప్ సంచలనం సృష్టించింది. ‘మేము ఈవీఎం మెషీన్ ఆపరేటర్‌తో మాట్లాడాం. మీరు రూ.కోటి ఇస్తే, మీకు 11,250 ఓట్లు వేయిస్తాం’ అని పేర్కొంటున్న ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో ఒక స్వతంత్ర అభ్యర్థి పోలీసులకు పిర్యాదు చేయడంతో చంద్వాడ్‌లో రాజకీయ వాతావరణం వేడెకింది.
చంద్వాడ్ నగర్ పరిషత్ మేయర్ పదవికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి రాకేశ్ అహిరే ఈ క్లిప్‌ను బయటపెట్టారు. అహిరే ఆరోపణల ప్రకారం, శక్తి విలాస్ ధోమ్సే అనే వ్యక్తి అతనిని మొబైల్లో సంప్రదించాడు. డబ్బు ఇస్తే ఈవీఎంలను తారుమారు చేయడం ద్వారా ఓట్లు వేయిస్తామని ధోమ్సే అతడిని ప్రలోభపెట్టాడు. వైరల్‌గా మారిన ఈ సంభాషణలో, ధోమ్సే కొన్ని షాకింగ్ వాదనలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థి వైభవ్ బాగుల్‌కు 13, 642 ఓట్లు వస్తాయని చెప్పారు. దీనిపై అహిరే సందేహాలు లేవనెత్తగా, ‘మేము ఈవీఎం మెషీన్ ఆపరేటర్‌తో మాట్లాడాం, కాబట్టి ఈ లెకింపులో ఓట్లు కచ్చితంగా వస్తాయి’ అని అతడు సమాధానమిచ్చాడు. ఈ క్లిప్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.