Bacteria | కరోనా పుణ్యమా అని పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది. గతంతో పోలిస్తే ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నిత్య జీవితంలో ఉపయోగించే ఏడు వస్తువులు టాయిలెట్ సీటుపై కంటే మురికిగా ఉంటున్నాయట. వాటిపై లెక్కకు మించిన బ్యాక్టీరియా, క్రిములు పేరుకుపోతున్నాయట. అమెరికాకు చెందిన పరుపుల తయారీ కంపెనీ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మరి ఆ వస్తువులేంటో చూద్దామా.
టాయిలెట్ కంటే మురికిగా ఉండే వాటిలో మొదటిది స్మార్ట్‌ఫోన్. దీనిపై టాయిలెట్ సీటుపై కంటే పదిరెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. పరిసరాల నుంచి నిరంతరం మన చేతికి అంటుకునే క్రిములు అక్కడి నుంచి స్మార్ట్ఫోన్పైకి చేరుతాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. కాబట్టి సబ్బు నీటిలో ముంచిన తడిగుడ్డతో కానీ, యాంటీబ్యాక్టీరియల్ ఉపయోగించి కానీ ఫోనును నిత్యం శుభ్రం చేస్తూ ఉండాలి.
స్మార్ట్‌ఫోన్ తర్వాతి స్థానంలో కీబోర్డు ఉంది. అరిజోనా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం సగటు కీబోర్డుపై ఒక చదరపు అంగుళంలో 3 వేలకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది. కంప్రెస్డ్ ఎయిర్ కానీ, బ్రష్‌తో కూడిన వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించి కానీ శుభ్రం చేసుకోవాలి.
ఇంట్లో ఎక్కువమంది ముట్టుకునే వాటిలో రిఫ్రిజిరేటర్ ఒకటి. కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం రిఫ్రిజిరేటర్ డోర్‌పై చదరపు అంగుళంలో 500కుపైగా బ్యాక్టీరియా ఉంటుంది. అయితే, ఈ వస్తువులపై ఉండే బ్యాక్టీరియా ఎక్కువగా హాని కలిగించకపోవచ్చని చాలావరకు అధ్యయనాలు చెబుతున్నాయి. మనచుట్టూ ఉండే పరిసరాలు, నిత్యం ఉపయోగించే వస్తువులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల సాధారణ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. దాదాపు ప్రతి ఇంట్లోనూ దిండు (మెత్త) ను ఉపయోగిస్తారు. వారం రోజులపాటు దానిని ఉతక్కుండా వాడితే టాయిలెట్ సీటుపై కంటే 17 వేల రెట్ల అధిక బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది.
అత్యంత మురికిగా ఉండేవాటిలో మౌస్ కూడా ఒకటి. శానిటైజర్‌తో ఎంత రుద్దినా దానిపై ఉన్న మురికి అంతత్వరగా వదలదు. దీనిపై చదరపు అంగుళానికి 1500 బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ స్టడీ తేల్చింది.
ఇంట్లో మురికిగా ఉండే వస్తువుల లిస్టులో రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. దీనిపై చదరపు అంగుళానికి 200 బ్యాక్టీరియా ఉంటుందని హాస్టన్ యూనివర్సిటీ స్టడీ స్పష్టం చేసింది.
ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వాష్‌రూమ్ ఒకటి. పబ్లిక్ వాష్‌రూమ్స్‌ను ఎంతోమంది ఉపయోగిస్తుంటారు. ఈ నాబ్స్పైన వందలకొద్దీ బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. వీటిని నిత్యం క్లీన్ చేసుకోవడం మేలు.
నల్లాలను కూడా రోజులో ఎంతోమంది ముట్టుకుంటారు. దీంతో ఇది కూడా క్రిములకు ఆవాసంగా మారిపోతున్నది.చేతులు కడుకున్న సమయంలో అదే చేతితో డిటర్జెంట్‌తో దానిని క్లీన్ చేసుకోవడం మంచిది.