అహ్మదాబాద్, జనవరి 12: రైలు చార్జీల్లో వృద్ధులు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరించాలన్న డిమాండ్‌పై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోసారి సమాధానం దాటవేశారు. రైల్వే ప్రయాణాల చార్జీల్లో ప్రయాణికులకు ఇప్పటికే 55 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు.
కొవిడ్ సంక్షోభానికి ముందున్న విధంగా సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరణపై గురువారం అహ్మదాబాద్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. అయితే అడిగిన ప్రశ్నకు మాత్రం మంత్రి సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రయాణికులకు ఇప్పటికే రాయితీ అందుతున్నదని, ప్రత్యేకంగా రాయితీ అవసరం లేదనట్టు ఆయన పరోక్షంగా చెప్పారు.